తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో ఎట్టకేలకు ఎక్స్‌ప్రెస్ రైలు హాల్ట్‌కు మార్గం సుగమమైంది. ఐదేళ్ల తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత విశాఖ–కడప తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు కొవ్వూరు స్టేషన్‌లో హాల్ట్ ఇస్తూ కేంద్ర రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంగళవారం కొవ్వూరు స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి హాజరై విశాఖ–కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చ జెండా ఊపారు. ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు పునరుద్ధరణ కావడంతో కొవ్వూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఈ హాల్ట్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎంపీ తెలిపారు.
నేటి నుంచే మచిలీపట్నం–విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా కొవ్వూరు స్టేషన్‌లో ఆగుతుందని పురంధేశ్వరి వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 6 నుంచి అనపర్తి స్టేషన్‌లో విశాఖ–లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
కొవ్వూరు, అనపర్తి స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని కొవ్వూరు రైల్వే స్టేషన్‌ను రూ.17 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తామని, పుష్కరాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.









