దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ & షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌ను ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తరపున పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. దుగరాజపట్నంలో 3,488 ఎకరాల భూమిని సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు, ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధమైందని సీఎం పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు, MSME యూనిట్లు మరియు కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సమగ్ర క్లస్టర్‌గా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న ప్రాధాన్యతను ఇచ్చి, దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌గా త్వరితగతిన ఆమోదించమని కేంద్రాన్ని అభ్యర్థించారు.
చంద్రబాబు ఫేజ్-1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మొత్తం రూ.1,361.49 కోట్లతో పని జరుగుతున్నట్లు తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్‌కు ఇప్పటికే కేంద్రం నుంచి రూ.138.29 కోట్లు మంజూరు కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.782.29 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన మూడు హార్బర్లకు కేంద్ర సహాయం ఇంకా అందాల్సి ఉందని చెప్పారు.
ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయాలనేది కూడా సీఎ చంద్రబాబు కేంద్రమంత్రికి దృష్టికి తీసుకెళ్ళారు. మొత్తం మీద ఫేజ్-1 పూర్తి కోసం కేంద్రం నుంచి రూ.590.91 కోట్లు అందాల్సి ఉన్నది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి పరిశ్రమల అభివృద్ధి, సముద్రపారిశ్రామిక రంగానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని సీఎం స్పష్టంగా పేర్కొన్నారు.









