రాష్ట్రంలో 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. స్వల్ప మార్పులతో ఈ పరీక్షా షెడ్యూల్ను ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో స్పష్టత ఏర్పడింది.
అధికారుల వివరాల ప్రకారం ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు మొదలవుతాయి. ఫస్టియర్ పరీక్షలు మార్చి 24తో ముగియనున్నాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 23 వరకు కొనసాగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం వేళల్లో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23న ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్, 24న సెకండియర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ జరుగుతుంది. ఫిబ్రవరి 25న ఫస్టియర్ ఇంగ్లీష్, 26న సెకండియర్ ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహిస్తారు. 27న ఫస్టియర్ హిస్టరీ పేపర్–1, బోటనీ పేపర్–1 ఉండగా, 28న సెకండియర్ హిస్టరీ లేదా బోటనీ పేపర్–2 జరుగుతుంది.
మార్చి నెలలో గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ వంటి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు కొనసాగనున్నాయి. మార్చి 24న ఫస్టియర్ మోడ్రన్ లాంగ్వేజ్ లేదా జియోగ్రఫీ పేపర్–1తో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. విద్యార్థులు ఈ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకుని సన్నద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది.









