తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకుల విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థిని మహమ్మద్ అసియా ఇటీవల చెన్నైలో నిర్వహించిన కరాటే పోటీలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విషయం తాజాగా మంత్రి కొండా సురేఖ దృష్టికి రావడంతో, ఆమె తన పర్యటనలో భాగంగా శుక్రవారం హన్మకొండలోని సంబంధిత మైనారిటీ విద్యాసంస్థను సందర్శించి అసియాను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా అసియా తనకు లభించిన గిన్నిస్ రికార్డు సర్టిఫికేట్‌ను మంత్రి సురేఖకు చూపించి, పోటీకి సంబంధించిన వివరాలను వివరించారు. తమిళనాడులోని చెన్నై నగరంలో అక్టోబర్ 5న జరిగిన కరాటే ప్రదర్శనలో సుమారు 3,000 మంది కరాటే ఛాంపియన్లు పాల్గొనగా, 17 మంది సమన్వయకర్తల పర్యవేక్షణలో కేవలం 863 మంది మాత్రమే అర్హత సాధించారని తెలిపారు.
ఈ పోటీలో తెలంగాణ నుంచి మైనారిటీ గురుకుల విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థినిగా అసియా ఎంపిక కావడం, గిన్నిస్ రికార్డు సాధించడం ఎంతో విశేషమని మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. మైనారిటీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో అసియా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. క్రీడా రంగంలో ముందుకు వెళ్లేందుకు అవసరమైన సహాయం, ఇబ్బందులు ఏవైనా ఉంటే తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా అసియా మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.









