కేంద్రం ఇటీవల అమలు చేసిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 2.0 సంస్కరణల కారణంగా ప్రభుత్వానికి సుమారు రూ. 47,000 కోట్ల ఆదాయ నష్టం ఏర్పడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేశింది. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రస్తావిస్తూ వివరించింది.
సంక్లిష్టమైన జీఎస్టీ రేట్లలో విస్తృతంగా తగ్గింపులు రావడంతో, స్థూలంగా రాబడిపై రూ. 93,300 కోట్ల వరకు ప్రభావం ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, కొన్ని వస్తువులను 28 శాతం శ్లాబ్ నుంచి 40 శాతం శ్లాబ్‌కు మార్చడం వల్ల రూ. 45,570 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని పేర్కొంది.
మొత్తంగా, జీఎస్టీ రేట్ల సంస్కరణల ప్రభావం రూ. 47,700 కోట్ల నష్టానికి పరిమితం అవుతుందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అయితే, ఈ అంచనాలు ఖచ్చితమని చెప్పలేమని, పన్ను వసూళ్లు స్థిరంగా ఉండకపోవచ్చు, వృద్ధి చెందవచ్చు అని కూడా స్పష్టం చేశారు.
అదనంగా, తక్కువ రేట్ల కారణంగా పన్నుల చెల్లింపులు మెరుగుపడే అవకాశం, సవాళ్లు తక్కువగా ఉండే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని ద్వారా వ్యాపారాలు, సగటు పన్ను దాతలకు తగిన సౌలభ్యం కల్పించబడుతుందని భావిస్తున్నారు.








