హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్, కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. దీంతో నియోజకవర్గమంతటా కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. మూడో విడత ఎన్నికల్లో ఎక్కువ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
హుస్నాబాద్ మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలకు గాను 15 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ఇదే తరహాలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. గ్రామీణ స్థాయిలో పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ ఫలితాలు నిదర్శనంగా మారాయి.
హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సరళిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు భారీ విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన సర్పంచ్‌లను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలిచిన నాయకులకే ప్రజలు పట్టం కట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గెలిచిన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉండి గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.









