కన్న బిడ్డను అమ్మేసిన తల్లి నిర్వాకం

A mother selling her two-month-old baby for money shocks Nizamabad; police unravel the truth.

మాతృత్వానికి, భార్యత్వానికి మచ్చ తెచ్చే ఓ దారుణ ఘటన నిజామాబాద్ నగరంలో వెలుగు చూసింది. డబ్బుకు ఆశపడి తన కడుపున పుట్టిన రెండు నెలల పసికందును భర్తకు తెలియకుండా అమ్మేసిన తల్లి నిర్వాకం సమాజాన్ని కుదిపేసింది. తాను, తన బిడ్డ ఇద్దరూ మిస్ అయ్యారని నాటకం ఆడిన మహిళ, చివరికి పోలీసుల విచారణలో అసలు నిజాన్ని బయటపెట్టాల్సి వచ్చింది.

ఈనెల 5న నగరంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన శ్రీనివాస్ భార్య లక్ష్మి, వారి రెండు నెలల బాబు అదృశ్యమయ్యారు. దీనిపై శ్రీనివాస్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఉమెన్ అండ్ బాయ్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈనెల 10న లక్ష్మి ఒక్కరే ఇంటికి తిరిగి రావడంతో పోలీసులకు అనుమానం కలిగింది.

పోలీసులు తమదైన శైలిలో విచారించగా, లక్ష్మి తన భర్తకు తెలియకుండా బిడ్డను అమ్మినట్లు ఒప్పుకుంది. స్థానిక మహిళలు రమాదేవి, మంజుల ప్రోద్భలంతో హైదరాబాద్‌కు చెందిన విట్టల్ అనే మధ్యవర్తి ద్వారా మహారాష్ట్ర పూణే నగరానికి చెందిన విశాల్‌కు రూ. 2.50 లక్షలకు బిడ్డను విక్రయించినట్లు వెల్లడైంది.

ఈ కేసులో బిడ్డను విక్రయించిన తల్లి లక్ష్మితో పాటు, మధ్యవర్తిత్వం చేసిన రమాదేవి, మంజుల మరియు బిడ్డను కొనుగోలు చేసిన పూణేకు చెందిన విశాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంతర్రాష్ట్ర డీల్‌ను నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన విట్టల్ పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని ఫోర్త్ టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్ తెలిపారు. ఈ ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share