పంచాయతీ ఎన్నికలలో ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మండల కేంద్రంలో స్పెషల్ పార్టీ బలగాలతో పురవీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం కలిగించేలా పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఫ్లాగ్ మార్చ్ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు, సందేశాలు ఎవరు చేయవద్దని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు సహించబోమన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడరాదని, ఓటర్లు తప్పనిసరిగా క్యూ లైన్ పాటించాలని సూచించారు.
ఓటర్లు మద్యం, డబ్బు, బహుమతులు వంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిజాయితీగా ఓటు వేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఎన్నికలు పూర్తైన అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, టపకాయలు పేల్చడం నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కాజల్ సింగ్, సీఐ రమేష్, ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.









