వరల్డ్ కప్ గెలుపులో అసాధారణ ప్రతిభ చాటిన భారత మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం రూ.2.50 కోట్ల నగదు బహుమతితో పాటు కడపలో 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలాన్ని కేటాయించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదాలో నియామకం ఇస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
కడప జిల్లా నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన శ్రీచరణి, కేవలం 21 ఏళ్ల వయసులోనే దేశానికి గర్వకారణంగా నిలిచారు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా ఆమె తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఈ ఏడాది శ్రీలంకపై వన్డే మ్యాచ్‌లతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆమె, అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో శ్రీచరణి కీలక మ్యాచ్‌లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లను చిత్తు చేశారు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి మార్గం సుగమం చేశారు. ఆమె బౌలింగ్ దాడికి ప్రత్యర్థి జట్లు పరుగులు తీయలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఈ ప్రదర్శనే భారత జట్టు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవడంలో కీలకంగా మారింది.
శ్రీచరణి సాధించిన విజయం యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతిభ ఉంటే అవకాశాలు తప్పక వస్తాయన్న విషయాన్ని ఆమె విజయమే నిరూపించిందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహం భవిష్యత్‌లో మరెందరో క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు అభినందిస్తున్నారు.









