గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

Heavy police deployment for the third phase of Gram Panchayat elections in Sangareddy district covering 207 villages.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి ఘట్టమైన మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 17న ఉదయం 7 గంటల నుంచి జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెర పడగా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి పహారాను ఏర్పాటు చేసింది. మూడో విడత ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎస్పీ పంకజ్ మొత్తం 1160 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని విధుల్లోకి దింపారు.

సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, కంగ్టీ, కల్హేర్, మనూర్, సిర్గాపూర్, నాగల్ గిద్ద, నిజాంపేట్, న్యాల్కల్ మండలాల్లో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 గ్రామపంచాయతీలకు గాను 27 ఏకగ్రీవం కాగా, మిగిలిన 207 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసింది.

మూడో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడ్డ, హిస్టరీ షీట్ కలిగిన 1583 మందిని ముందస్తుగా బౌండ్ ఓవర్ చేశారు. ఈ నెల 15న సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు 44 గంటల పాటు ‘సైలెంట్ పీరియడ్’ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం పూర్తిగా నిషేధించబడింది.

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మద్యం, డబ్బు పంపిణీ, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు రూ.11.68 లక్షల విలువగల 1704 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేసి, 148 కేసులు నమోదు చేశారు. మొదటి రెండు విడతల ఎన్నికలు స్వల్ప ఘటనలతో ప్రశాంతంగా ముగియగా, మూడో విడతను కూడా అంతే శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిగా అలర్ట్‌గా ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share