వైకుంఠద్వార దర్శనాలకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం తిరుమలలో ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. తొలి మూడు రోజుల వైకుంఠద్వార దర్శనాలకు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ విధానం ద్వారా టోకెన్లు కేటాయించినట్లు తెలిపారు.
మిగతా ఏడు రోజులపాటు టోకెన్లు లేకుండానే సామాన్య భక్తులకు సర్వదర్శనం ద్వారా వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో భద్రత, క్యూలైన్ నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం 50 అజెండా అంశాలతో టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని, ఇటీవల ఇందుకోసం రూ.9 కోట్ల విరాళం అందిందని చెప్పారు. భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం టీటీడీ నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు.
అలాగే ఆలయ ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్యవృక్షాల పెంపకానికి 100 ఎకరాల్లో ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పలమనేరులోని టీటీడీ గోశాల ప్రాంగణాన్ని ఇందుకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై రేపటి పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. భక్తుల అవసరాలకు సరిపడా బ్లేడులను ప్రముఖ తయారీ సంస్థ ఈ నెల 17వ తేదీన విరాళంగా అందజేయనున్నట్లు కూడా బీఆర్ నాయుడు పేర్కొన్నారు.









