గాజులరామారం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 329/2, 329/10లో ఉన్న 127.30 ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలో మహదేవపురం వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులతో కలిసి కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామ రెవెన్యూ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో మొత్తం 167.88 ఎకరాల భూమిని 1975 ఫిబ్రవరి 6న శాలివాహన బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మహదేవపురం కాలనీ లే అవుట్‌గా గ్రామ పంచాయితీ తీర్మానంతో ఆమోదం పొందిందని తెలిపారు. ఈ లే అవుట్‌లోని ప్లాట్లను 1992 నుంచి విక్రయించి రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు పేర్కొన్నారు.
2008లో సుమారు 85 శాతం ప్లాట్ యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించారని, దాదాపు 40 శాతం మంది ఇంటి అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టారని వివరించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో కొందరు రెవెన్యూ అధికారులు ఈ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ 2017 నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారని తెలిపారు. దీని వల్ల అనేక మంది ప్లాట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశానికి సంబంధించి గత 58 ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాల నుంచి పొందిన పహానీలు, ఇతర కీలక ఆధారాలను కలెక్టర్‌కు సమర్పించినట్లు కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. అందజేసిన పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహదేవపురం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు డి.జగదీశ్వర్ రెడ్డి, ఎం.రంగారావు, ప్రధాన కార్యదర్శి డి.ప్రసాదబాబు, జాయింట్ సెక్రటరీలు రామచంద్రారెడ్డి, ఆర్.ప్రవీణ్ కుమార్, కోశాధికారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









