విత్తన హబ్‌గా పేరొందిన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందాలంటే విత్తన ధృవీకరణ సంస్థ పాత్ర అత్యంత కీలకమని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. విత్తనాలకు ధృవీకరణ జరిగితేనే రైతుకు నమ్మకమైన, నాణ్యమైన విత్తనాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. కల్తీ విత్తనాల సమస్యపై ధృవీకరణ సంస్థ జవాబుదారీతనం చాలా ముఖ్యమని, ముఖ్యంగా ఫీల్డ్‌లో పనిచేసే సీడ్ సర్టిఫికేషన్ అధికారుల పాత్ర మరింత బలోపేతం కావాలన్నారు. శనివారం విత్తన ధృవీకరణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కోరిన ప్రొఫెసర్ కోదండరాం, విత్తన ధృవీకరణ సంస్థకు డిపార్ట్మెంటల్ హోదా కల్పించి, ట్రెజరీ నుంచి నేరుగా ఉద్యోగుల జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. దీని ద్వారా సంస్థ ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతూ సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. విత్తన ధృవీకరణ ప్రక్రియ మరింత బలపడితే, సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని రైతులకు సర్టిఫైడ్ విత్తనాలను అందించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు లిఖిత పూర్వకంగా తెలియజేస్తానని హామీ ఇచ్చారు.
డిపార్ట్మెంటల్ హోదా కల్పిస్తే రాష్ట్రంలో విత్తనాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఒకే పరిపాలనలోకి వచ్చి సమగ్ర పర్యవేక్షణ సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో టెక్నికల్ స్టాఫ్‌కు జీతాలు చెల్లిస్తోందని, విత్తన ధృవీకరణ చార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విత్తన చట్టంలో సీడ్ సర్టిఫికేషన్‌కు కీలక ప్రాధాన్యత ఉందని, అనేక రాష్ట్రాలు ఇప్పటికే తమ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చాయని గుర్తు చేశారు.
తమిళనాడు, కేరళ, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఇప్పటికే సర్టిఫైడ్ విత్తనాల సరఫరాను తప్పనిసరి చేశాయని, కొన్ని రాష్ట్రాల్లో అన్ని పంటల నోటిఫైడ్ రకాలకు ధృవీకరణను అమలు చేస్తున్నాయని వివరించారు. అలాగే, విత్తన ధృవీకరణ సంస్థ ఉద్యోగుల పెన్షన్‌ను రూ.30 వేలకు పెంచాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.32 వేల బేసిక్ సాలరీతో పాటు, కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విత్తన ధృవీకరణ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.









