తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ను శుక్రవారం సందర్శించి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. 2002 నుండి ఉన్న ఓటరు జాబితాను 2025 జాబితాకు అనుగుణంగా మ్యాపింగ్ చేయడం ముఖ్యమని, ఇది జాగ్రత్తగా, నిర్దిష్ట విధంగా జరగాలని ఎఆర్ఓ, ఈఆర్ఒలకు ఆదేశించారు.
ప్రధాన ఎన్నికల అధికారి తన సమీక్షలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మ్యాపింగ్ పనులు ప్రస్తుతం 15 శాతం మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. రెండు వారాల్లో 30 శాతం మ్యాపింగ్ పూర్తి చేసి వేగవంతం చేయాలని వారిని ప్రోత్సహించారు. ప్రతి బిలోకు రోజువారీ లక్ష్యాలను ఇచ్చి, బిఎల్ఓలతో ఇంటింటికి వెళ్ళి ప్రత్యక్ష పరిశీలన, ఫోటోలతో డేటాను అప్‌డేట్ చేయాలని సూచించారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ మ్యాపింగ్‌లో క్షేత్రస్థాయి పరిశీలన అవసరం ఉన్నట్లు ప్రధాన అధికారి సూచించారు. వెబ్‌సైట్‌లో హౌస్ నంబర్, పేరు, ఎపిక్ నంబర్ ద్వారా సెర్చ్ ఆప్షన్‌తో మ్యాపింగ్ కొంత సులభమయ్యిందని, అవసరమైతే అదనపు సిబ్బంది, కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.
ప్రతి నియోజకవర్గం నుండి ఈఆర్ఓలతో మ్యాపింగ్ పరిస్థితులు, ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవాలని, ఏవిధమైన సలహాలు అవసరమైతే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎప్పుడైనా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఓటరు జాబితా మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా ఉంటుంది అని అధికారులు భావిస్తున్నారు.









