పీర్జాదిగూడలోని వరంగల్ జాతీయ రహదారిలో సాయి ఈశ్వర్ (35) అనే యువకుడు ఒంటిపై పెట్రోలు పోసి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. గురువారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, సాయి ఈశ్వర్ జగద్గిరిగుట్ట, మాగ్దమ్ నగర్లో భార్య మరియు పిల్లలతో నివసిస్తున్నాడు.
సాయి ఈశ్వర్ గురువారం పిర్జాదిగూడలోని ఓ మీడియా కార్యాలయానికి వచ్చి కొద్దిసేపటికి ఆ తర్వాత బయటకు వచ్చి ఒంటి పై పెట్రోలు పోసి నిప్పంటించుకున్నాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే 108 ద్వారా సమాచారం అందించి, అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వార్తల ప్రకారం, రెండు రోజుల క్రితం అతని భార్య, పిల్లలు ఓ ప్రజాప్రతినిధి వద్దకు ఆర్థిక సహాయం కోసం వెళ్ళి కొంత సహాయం అందుకున్నట్టు తెలుసు. ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రచారమైన తర్వాత అతని మిత్రులు సాయిని హేలు చేసి మాట్లాడారు.
ఈ ఘటన కారణంగా సాయి ఈశ్వర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. అయితే సాయి ఈశ్వర్ తన ఆత్మహత్య యత్నం బీసీ ఉద్యమం కోసం చేశాడని తెలిపినట్లు సమాచారం. పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు.









