రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బీడీ కార్మికుల ఆరోగ్య సమస్యపై ప్రసంగించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో వేలాది కుటుంబాలు బీడీ పరిశ్రమపై ఆధారపడినట్లు పేర్కొన్నారు. బీడీ వాడుక కారణంగా నోటి క్యాన్సర్ సమస్య పెరుగుతుందని, నివారణకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వద్దిరాజు మాట్లాడుతూ, కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశ ఆర్థిక పురోగతికి విశేష కృషి చేసినారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని గౌడ కుల సంక్షేమంలో భాగంగా మద్యం దుకాణాల్లో 15 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లు తెలిపారు.
అలాగే, మద్యం అమ్మకాల్లో సరైన పర్యవేక్షణ లేకుండా సమస్యలు పెరుగుతున్నాయని, కల్తీ మద్యం, బ్లాక్ మార్కెట్ మద్యం, బెల్ట్ షాపులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమవుతోందని, ఇది సామాజిక సమస్యలకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సమన్వయంగా పనిచేయాలని కోరారు.
కేసరంగా, సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లుకు బీఆర్ఎస్ మద్దతునిస్తున్నదని తెలిపారు. సామాజిక కోణం మాత్రమే కాకుండా ఆర్థిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ప్రకటించిందని చెప్పారు.









