ఖమ్మం నగరంలో ముగ్గురు బాలికలు రహస్యంగా అదృశ్యమవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న బాలికలు మంగళవారం మధ్యాహ్నం స్కూల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరకపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాయంత్రం వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారు స్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయులను సంప్రదించారు.
ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది బాలికల సహాధ్యాయులను విచారించగా, ముగ్గురు బాలికలు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్కూల్ గేటు దగ్గర కనిపించారని తోటి విద్యార్థులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిసి వెళ్లారు అన్న విషయాలు స్పష్టంగా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు మరింత అనుమానంతో ఉన్నారు. స్కూల్ సీసీ కెమెరా దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ సంఘటనపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముగ్గురు బాలికలు ఖమ్మం నగరానికి చెందినవారే కాగా, వారు 7వ తరగతి ఉర్దూ మీడియంలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికలు స్వచ్ఛందంగా వెళ్లారా? ఎవరి ప్రేరణతో వెళ్లారా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో కీలక ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
బాలికల మిస్సింగ్ వార్త బయటకు రావడంతో ఖమ్మం నగరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ పిల్లలు క్షేమంగా దొరకాలని ఆశిస్తున్నారు. పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజీలు, ఆటో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌ల వద్ద తనిఖీలు చేపట్టారు. బాలికలు త్వరలోనే క్షేమంగా దొరుకుతారని పోలీసు అధికారులు కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు.









