ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనావాసాల మధ్య తిరుగుతున్న క్రూరమృగాల కారణంగా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అయితే, మహారాష్ట్ర పాల్గర్ జిల్లాలో ఓ 11 ఏళ్ల విద్యార్థి తనపై దాడి చేసేందుకు వచ్చిన చిరుతను ఎదుర్కొన్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
శుక్రవారం సాయంత్రం మాలా పద్విపాడ ప్రాంతానికి సమీపంలో 5వ తరగతి చదువుతున్న మయాంక్ కువారా అనే బాలుడిపై చిరుత దాడి చేసింది. అతను తన రెండు భుజాలకు తగిలించిన స్కూల్ బ్యాగ్ పై పులి పంజా పడటంతో తొలుత భయపడ్డాడు.
తర్వాత మయాంక్ తన స్నేహితుడితో కలిసి పులిపై రాళ్లను రవ్వడం ప్రారంభించాడు. దీనితో చిరుత భయపడి అడవిలోకి పరుగు పెట్టింది. ఈ ఘటనలో స్కూల్ బ్యాగ్ అతనికి ప్రాణ రక్షకంగా మారింది. కాసేపటికి చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశారు.
బాలుడి చేతికి గాయాలు వచ్చే విధంగా పులిగోర్లు పడగా, అతనిని విక్రమ్ గడ్ విలేజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు బాలుడు కోలుకుంటున్నారని తెలిపారు. స్థానిక అటవీశాఖ స్కూళ్లను సాయంత్రం 4 గంటలకే మూసివేయాలని సూచిస్తూ, పెద్ద పులుల కదలికలను ట్రాక్ చేయడానికి ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.









