తాండూరు పట్టణం కేంద్రంగా నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సౌత్ జోన్ పోలీస్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపినట్లుగా, అరెస్ట్ అయినవారిలో కస్తూరి రమేష్ బాబు, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ సోహైల్, మొహమ్మద్ ఫహాద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, తహా, సయ్యద్ అల్తమాష్ ఉన్నారు.
ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు, తన సోదరి కె.రామేశ్వరి సహాయంతో, తాండూరులోని తన ఇంట్లో నకిలీ నోట్ల ముద్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. కోకట్ రోడ్‌లోని నివాసంలో స్కానర్, కంప్యూటర్, ప్రింటర్, JK బాండ్ పేపర్ వంటి సామాగ్రిని సేకరించి నకిలీ నోట్ల తయారీలో ఉపయోగించారు.
పోలీసుల వివరాల ప్రకారం, అసలు కరెన్సీ నోట్ల ముందు, వెనుక భాగాలను స్కానర్ ద్వారా స్కాన్ చేసి, ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్ ద్వారా సవరణలు చేసి కరెన్సీ పరిమాణానికి సరిపోయేలా సర్దుబాటు చేశారు. తరువాత వాటిని జేకే బాండ్ పేపర్‌పై ముద్రించి, బ్లేడ్‌తో అసలు నోట్ల సైజ్‌లో కట్ చేసేవారు.
తయారైన నకిలీ నోట్లు మార్కెట్లో చలామణి చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు గోప్య సమాచారం ఆధారంగా దాడి చేసి ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తూ, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.









