చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో గురువారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. కుర్మానిపల్లి గ్రామానికి చెందిన రైతు కిట్టప్ప (64) రాత్రి తన రాగి పంటకు కాపలా కాయడానికి పొలానికి వెళ్లారు. అయితే తెల్లవారుజామున అడవిలో నుంచి బయటకు వచ్చిన ఏనుగుల గుంపు పొలంలోకి దూసుకువచ్చి పంటలను తినేసి ధ్వంసం చేయడం ప్రారంభించింది.
పంటను రక్షించాలనే ఉద్దేశంతో కిట్టప్ప ఏనుగులను తరిమివేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఏనుగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి. అతని మీద దూసుకొచ్చిన ఏనుగులు గాయపరిచి నేలకేసి పడేశాయి. రైతు ఉన్న గుడిసెను కూడా అవి పూర్తిగా ధ్వంసం చేశాయి. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి కిట్టప్ప అప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉన్నారు.
సమాచారం అందుకున్న కుప్పం అటవీ శాఖ అధికారి జయశంకర్, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదచాయ నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
ఏనుగుల సంచారం కారణంగా భయాందోళనకు గురవుతున్న పరిసర గ్రామాల ప్రజలు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాత్రి వేళల్లో అడవికి సమీప ప్రాంతాల్లో ఏనుగుల కదలికలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అడవి జంతువుల దాడులను నివారించేందుకు బలమైన రక్షణ చర్యలు చేపట్టాలని, పంటలకు నష్టం జరిగిన రైతులకు పరిహారం అందించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.









