సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రస్తుతం సినీ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుగా నిలిచింది. వర్కింగ్ టైటిల్‌గా “SSMB29”గా పిలుస్తున్న ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్టైనర్గా చర్చనీయాంశమైంది. హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్, నైరోబి (కెన్యా) వంటి అంతర్జాతీయ లొకేషన్లలో షూటింగ్ కొనసాగుతోంది.
మహేశ్ బాబు అభిమానులు ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్డేట్స్ రాకపోవడంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇటీవల టీమ్ వరుసగా కీలక పోస్టర్లు విడుదల చేస్తూ హైప్ పెంచుతోంది. మొదట విలన్ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ కాగా, ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం సాయంత్రం విడుదలైంది. #గ్లోబెట్రోటర్ ఈవెంట్ సాంగ్ కూడా ఇప్పటికే భారీ స్పందనను రాబట్టింది.
దర్శకుడు రాజమౌళి తాజాగా విడుదల చేసిన వీడియోలో నవంబర్ 15న జరగబోయే #గ్లోబెట్రోటర్ ఈవెంట్‌పై కీలక అప్డేట్ ఇచ్చారు. “ఈవెంట్ రోజున RFC ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది. ఎంట్రీ పాస్ సూచనలను అనుసరించండి. పోలీసులు, భద్రతా సిబ్బందితో సహకరించండి,” అంటూ ఆయన అభిమానులను కోరారు. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి ఓ సినిమా పరిచయ కార్యక్రమాన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో లైవ్ స్ట్రీమ్ చేయడం ఇదే మొదటిసారి కానుంది.
సినిమా ప్రీ-లుక్ పోస్టర్ మహేశ్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా విడుదలై అభిమానుల్లో భారీ ఉత్కంఠ రేపింది. టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ స్థాయిలో విజువల్ ఎక్స్‌పీరియెన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వం, మహేశ్ బాబు స్టార్ పవర్ కలయికతో ఈ సినిమా గ్లోబల్ బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.









