ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబు పేలుడు వెనుక అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు డాక్టర్ల హస్తం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు తేల్చిన విషయం తెలిసిందే. వారిని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే, యూనివర్సిటీపై వచ్చిన పలు వార్తలపై యాజమాన్యం స్పష్టత ఇచ్చింది.
వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరుతో విడుదలైన ప్రకటనలో, పేలుళ్లకు పాల్పడిన వైద్యులతో యూనివర్సిటీకి కేవలం వృత్తిపరమైన సంబంధమే ఉందని, వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. యూనివర్సిటీ 1997 నుంచి విద్యాసంస్థలను నిర్వహించిందని, గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన తర్వాత యూనివర్సిటీగా మారిందని కూడా పేర్కొన్నారు.
అల-ఫలాహ్ యూనివర్సిటీ 2019 నుంచి MBBS కోర్సులను నిర్వహిస్తోంది. అక్కడ చదివి డాక్టర్ పట్టాలందుకున్నవారు భారత్ తోపాటు విదేశాల్లోని ప్రముఖ హాస్పిటల్స్, సంస్థల్లో పనిచేస్తున్నారని చెప్పారు. డాక్టర్ల అదుపులోకి తీసుకోవడం వృత్తిపరమైన పరిధిలోనే జరిగిందని, యూనివర్సిటీ తమ ఉద్యోగుల వ్యక్తిగత చర్యలకు బాధ్యత వహించదని స్పష్టం చేశారు.
ప్రకటనలో యూనివర్సిటీ ఎలాంటి కెమికల్స్ నిల్వ చేయడం లేదని, కోర్సులకు అనుగుణంగా మాత్రమే ల్యాబ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కథనాలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలి, సమాచారాన్ని ధృవీకరించాకే ప్రచారం చేయాలని యాజమాన్యం కోరింది.








