నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళ్ పహాడ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేసింది. చేవూరి ప్రతాప్ గౌడ్ (31) అనే యువకుడు మరో మూడు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉండగా, అనూహ్యంగా తన జీవితాన్ని ముగించుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇటీవలే ప్రతాప్‌కు వివాహ నిశ్చయం కాగా, కుటుంబం ఆనందంలో మునిగి తేలింది. వివాహం ఈనెల 16న జరగాల్సి ఉంది.
ప్రతాప్ వృత్తి రీత్యా రైతు. ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడైన అతను కుటుంబానికి ఎంతో ఆప్యాయుడు. పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఇంట్లో పోచమ్మ పండుగ జరపాలని నిర్ణయించారు. అందరూ సంతోషంగా ఉండగా, చిన్న మాటపాటు వల్ల ప్రతాప్ మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.
సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతాప్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా అతని బైక్ గుట్టపై కనిపించింది. ఆ దిశగా వెతికిన వారు చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించిన ప్రతాప్ మృతదేహాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పెళ్లి విందు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వరుడు ఆత్మహత్య చేసుకున్న వార్త తెలిసి గ్రామం మొత్తం సంతాపంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించగా, బంధువులు కన్నీటిని ఆపుకోలేకపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.








